
వనపర్తి, వెలుగుః రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం పై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్ లో సూపరింటెండెంట్‌లతో భూ భారతి చట్టం పై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతి చట్టం-- 2025 పై ఈ నెల 17 నుంచి మండలాల వారీగా రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి చట్టం పై అవగాహన, అనుమానాలను నివృతి చేయాలని సూచించారు.
ధరణి స్థానంలో వచ్చిన ఈ చట్టంతో ఒకేరోజు రిజిస్ట్రేషన్ తో పాటు మ్యుటేషన్ సౌకర్యం కల్పించారన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసే ముందు సంబంధిత భూమి సర్వే చేసే మ్యాప్ తయారు చేస్తారని పేర్కొన్నారు. తహసీల్దార్ ద్వారా భూ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్ చేస్తారని తద్వారా నెలల తరబడి మ్యుటేషన్ కోసం తిరగడం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడం ఉండదన్నారు. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం ఉంటుందన్నారు.